కాలం ఏదయినా జుట్టు ఎండుగడ్డిలా పొడిబారినట్లు ఉంటుంది కొందరికి.
అలాగని ఆ జుట్టును పట్టుకుచ్చులా మార్చేందుకు బజార్లో దొరికే ఉత్పత్తులు
అదేపనిగా వాడటం కూడా సరైన పనికాదు. అందుకే ఇంట్లోనే చిన్నచిన్న
ప్రయత్నాలతోే ఆ సమస్యకు పరిష్కారాలు వెతకండి.
మీరు శిరోజాలంకరణ
నిమిత్తం తరచూ కర్లింగ్ ఐరన్, హాట్ రోలర్లూ, బ్లో డ్రైయర్లూ.. లాంటివి
వాడుతున్నారా! అదేపనిగా వాటిని వాడటం వల్ల జుట్టులోని తేమ పోయి, పొడి
బారుతుంది.
తరచూ షాంపూలు వాడటం వల్ల
జుట్టుకు హాని కలుగుతుంది. వాటిల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటమే అందుకు
కారణం. గాఢత తక్కువగా ఉండి, తల్లోని సహజనూనెల్ని పెంచే షాంపూలు కొన్ని
ప్రత్యేకంగా దొరుకుతాయి. వాటిని ఎంచుకోవడం మేలు.
షాంపూను మాత్రమే వాడటం
వల్ల కూడా జుట్టు పొడిబారుతుంది. దాన్ని తగ్గించుకోవాలంటే షాంపూతో పాటు
కండిషనర్ కూడా తప్పనిసరి. అది కూడా నాణ్యమైనది, సువాసన లేనిది ఎంచుకుంటే
జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.. దీన్ని తలస్నానం చేసినప్పుడే కాదు.. దానికి
ముందు కూడా జుట్టుకు పట్టించి.. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. గోరువెచ్చని
కొబ్బరినూనెను తలకు పట్టించి మర్దన చేసుకోవడం వల్ల కూడా ఫలితం
కనిపిస్తుంది.
జుట్టు శుభ్రపడి, మెరవాలనుకుంటే వెనిగర్ మంచి ఎంపిక.
తలస్నానం పూర్తయ్యాక అరమగ్గునీటిలో చెంచా వెనిగర్ వేసుకుని ఆ నీరు
జుట్టంతా పట్టేలా పోసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో తలారా స్నానం చేయాలి.
గుడ్డులో ప్రొటీన్‌తోపాటూ లెసిథిన్ అనే పోషకం కూడా ఉంటుంది. ఈ రెండూ
జుట్టును ఆరోగ్యంగా ఉంచి, పట్టుకుచ్చులా మారుస్తాయి. రెండు గుడ్ల సొనను
బాగా గిలకొట్టాలి. అందులో రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌నూనె, చెంచా వెనిగర్
వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. అరగంటాగి
కడిగేసుకోవాలి.
జుట్టుపై ఎండ నేరుగా పడకుండా చూసుకోవాలి.
సూర్యకిరణాలు జుట్టుపై పడినప్పుడు తల్లోని తేమ తగ్గిపోతుంది. అందుకే ఎండలో
బయటకు వెళ్తున్నప్పుడు వెంట గొడుగు తప్పనిసరి. లేదంటే ఓ టోపీ అయినా
పెట్టుకోవాలి. ఆ రెండూ కాకపోతే స్కార్ఫ్ అయినా సరే తలకు చుట్టుకోవాలి.
అలాగే తలస్నానం చేస్తున్నప్పుడు మరీ వేడినీళ్లు వాడుతుంటారు కొందరు. కానీ
వేడినీళ్లు అలా పోసుకోవడం వల్ల జుట్టులోని సహజనూనెలు పోతాయి. దాంతో జుట్టు
పొడిబారి, క్రమంగా ఎండుగడ్డిలా మారుతుంది. గోరువెచ్చని నీరువాడితే అవి
తల్లోని తేమను కాపాడి, మెరిసేలా చేస్తాయి.
No comments:
Post a Comment