Monday, March 21, 2016

"అర్జునుని గర్వభంగం"



"అర్జునుని గర్వభంగం"
శ్రీకృష్ణుని భక్తులలో తానే గొప్పవాడిని అనే గర్వం అర్జునుడిలో ప్రవేశించింది ఒకసారి. శ్రీకృష్ణుడు అర్జునుని మనోభావాన్ని గ్రహించాడు. ఒకరోజు విహారార్థం మారువేషాలలో అర్జునుని తీసుకుని బయలుదేరాడు శ్రీకృష్ణుడు. వారు కోంతదూరం వెళ్ళాక ఎండు గడ్డిని తింటున్న ఒక విచిత్ర బ్రాహ్మణుడు కనిపించాడు. కానీ అతడు ఒక ఖడ్గం ధరించి ఉన్మాడు.
అర్జునుడు బ్రాహ్మణుడితో: "స్వామి, ప్రాణిని హింసించకుండా కేవలం ఎండు గడ్డి తిని జీవిస్తున్న మీరు కత్తిని ఎందుకు ధరించారు?"
బ్రాహ్మణుడు: నా కంటబడితే నలుగురిని శిక్షించాలని.
అర్జనుడు: వారెవరు?
బ్రాహ్మణుడు: మొదటవాడు నారదుడు!
అర్జ: నారదుడు ఏం చేసాడు?
బ్రాహ్మ: ఎప్పుడూ తన కీర్తనలతో నా స్వామికి నిద్రలేకుండా చేస్తాడు. స్వామి సుఖాన్ని గమనించక్కర్లేదా. రాత్రి, పగలూ స్తోత్రాలేనా?
అర్జ: రెండవ వారెవరు?
బ్రాహ్మ: తెలివి తక్కువ ద్రౌపది!
అర్జ: ద్రౌపది ఏం చేసింది?
బ్రాహ్మ: నా స్వామి భోజనానికి కూర్చుంటే బొబ్బలు పెట్టసాగింది. నా స్వామి భోజనం మానుకుని వెళ్ళి దూర్వాసుని శాపం నుండి పాండవులను రక్షించారు. తాము తినగా మిగిలిన ఎంగిలి కూడు నా స్వామితో తినిపించింది!
అర్జ: మూడవ వ్యక్తి ఎవరు?
బ్రాహ్మ: ప్రహ్లాదుడు. జంకు, గొంకు లేకుండా నా స్వామిని పిలిచేవాడు. అతని తండ్రి విధించిన శిక్షలన్నిటినీ నా స్వామి భరించాల్సివచ్చింది. అతని కోసం వజ్రతుల్యమైన స్తంభాన్ని పగలగొట్టుకొని వచ్చారు నా స్వామి.
అర్జ: నాలుగవ వ్యక్తి ఎవరు?
బ్రాహ్మ: ఉన్నాడొక నిర్భాగ్యుడు, అర్జునుడు. చూడు అతగాడి దుండగం. నా జగన్నాథుణ్ణి తీసుకెళ్ళి కురుక్షేత్ర యుద్ధంలో నీచమైన తన రధ సారధ్యాన్ని వహింపచేసాడు. అది మహాపరాధం కాదా?
అర్జునుడు పేద బ్రాహ్మణుడి భక్తి చూసి నిశ్చేష్టుడయ్యాడు. క్షణం నుంచే అతడి గర్వం అణిగిపోయింది.
"ఓం నమో భగవతేవాసుదేవాయ"
[16/03 11:17 am] ‪+91 94400 37125: అష్టాదశ పురాణాలు
1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.
2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.
3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంధం.
4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు.
5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.
6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.
7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.
8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.
9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.
10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.
11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.
12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.
13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.
14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.
15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు.
16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.
17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు.
18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు.

No comments:

Post a Comment