Friday, February 5, 2016

మనసు మాత్రం చాలా విశాలమైనది.

నర్సీపట్నం నుండి విశాఖపట్నంకు దగ్గరలో గల లంబసింగి ప్రాంతానికి నా బైక్ లో వెళ్తున్నాను. చాలా ఆకలి వేయడంతో రోడ్ పక్కనే ఉన్న ఒక చిన్న గుడిసె దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఓ ముసలాయన గుడిసె బయట, పొయ్యిపై టీ కాస్తున్నాడు. అతడి దగ్గరికి వెళ్లి ఒక టీ ఇవ్వమని, అలాగే తినడానికి ఏమైనా ఉంటే తీసుకురమ్మన్నాను. లోపలి నుండి ముసలావిడ బయటకు వచ్చింది. నేను ఏదైనా తీసుకురమ్మని చెప్పడం ఆ ముసలావిడకు వినిపించింది. అయితే నేను చెబుతున్న విషయాన్ని వారిద్దరూ అర్థం కానట్లుగా చూసినా, కొద్దిసేపటి తర్వాత ఒక ప్లేట్ లో అయిదు ఇడ్లీలను తీసుకువచ్చి, టేబుల్ పై పెట్టి కూర్చొని తిను బాబు అని చెప్పారు. బాగా ఆకలిగా ఉండడంతో ఇంకేమీ ఆలోచించకుండా ఆ ఇడ్లీలను తినేశాను, ఆ తర్వాత ఒక టీ తాగి,తాత బిల్ ఎంతా?అని అడిగాను.

దానికి ఆ పెద్దమనిషి రూ.5 ఇవ్వమన్నాడు. ఏంటి నేను తిన్న ఈ రుచికరమైన మరియు సంతృప్తినిచ్చిన ఈ బ్రేక్ ఫాస్ట్, టీ కేవలం రూ.5 రూపాయలా అని అడిగాను.  అవును బాబు టీకి 5 రూపాయలే అన్నాడు, అసలు నిజం ఏమిటంటే ఆ వృద్ధ దంపతులు తమకోసం  చేసుకున్న ఇడ్లీలను అడగగానే  నాకోసం తెచ్చి వడ్డించారు. తమ జీవనం కోసం ఓకే టీ స్టాల్ పెట్టుకొని బ్రతుకుతున్నారు. అది తెలుసుకున్న నా కళ్ళ వెంబడి కన్నీళ్లు వచ్చాయి. అయితే ఆ రూ.5 ఇవ్వడానికి మనసొప్పక, ఇంకొంచెం డబ్బులు తీసి ఇచ్చాను, ఆ వృద్ధ దంపతులు వద్దు.. వద్దు బాబూ అంటూ డబ్బు తిరిగిచ్చేశారు.

ఇదంతా కళ్ళారా చూసిన  నాకు. ఇప్పుడు కూడా డబ్బులకు ఆశపడని వాళ్ళు, తమ కడుపు కాల్చుకొని పక్కవాళ్ళ ఆకలి తీర్చే వారున్నారని వీళ్ళని చూశాకే తెలిసింది. నాలాంటి వాడు అక్కడికి వెళ్ళి, ఏదైనా తినడానికి ఉందా అని అడిగినప్పుడు, ఇక్కడ ఏమి దొరకవని చేతులు దులిపేసుకోవచ్చు, కానీ ఆకలి బాధ ఎలా ఉంటుందో జీవితాన్ని అనుభవించిన ఆ వృద్ధ దంపతులకు తెలుసు కాబట్టే ఏమాత్రం ఆలోచించకుండా.. తమ ఆకలిని చంపుకొని నాకు వడ్డించారు. వారి మానవత్వం, దయాద్ర హృదయం చూసి.. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది, బ్రతికున్నన్నాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమని అక్కడినుండి వెళ్లిపోయాను. వాళ్ళు జీవిస్తున్నది చిన్ని గుడిసెలోనే కానీ వారి మనసు మాత్రం చాలా విశాలమైనది.


No comments:

Post a Comment